డిచ్‌పల్లి, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో శనివారం కూడా ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ కొనసాగింది.
ఆరవ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి విచ్చేసి ప్రసంగించారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేవా గుణమే పరమావధిగా భావించాలని ఆమె సూచించారు. మానవ సేవే మాధవ సేవ అని కొనియాడారు. కన్న తల్లికి, ఉన్న ఊరికి సేవ చేసి తరించాలని హితవు పలికారు.
గత ఆరు రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి గ్రామ ప్రజలను చైతన్యం చేస్తున్నందుకు వాలంటీర్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. అక్షరాస్యతా సాధన, విద్యా వైద్య సదుపాయాలను అందిపుచ్చుకోవడం, ఉపాధి కల్పన, ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు, అంటురోగాలు, ప్రాణ హాని కలిగించే వైరస్ లు, స్వయం పోషక ఆహార పదార్థాల స్వీకరణ విషయాల్లో వాలంటీర్లు పల్లె జనులకు అవగాహన కల్పించడం సంతోషదాయకమని అన్నారు. గ్రామ పంచాయితి, సెక్రటరీ, పాఠశాల, అంగన్ వాడి, వెలుగు, ఆశా వర్కర్స్ వంటి సంస్థల సిబ్బందితో కలిసి పని విధానాలను తెలుసుకోవడం ఆనందాయకమని అన్నారు.
ప్రధాన వక్తగా సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. అంజయ్య విచ్చేసి ‘‘జీవన నైపుణ్యాలు’’ మీద ప్రత్యేక ప్రసంగం చేశారు. వాలంటీర్ల ప్రాథమిక హక్కులతో పాటుగా నైతిక బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలో పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. అభిషేక్ విచ్చేసి ఉచిత డెంటల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ ప్రజల పళ్ల సమస్యలను తెలుసుకొని వాలంటీర్లు వాళ్లకు ఈ క్యాంప్ లో పరీక్షలు చేయించారు. యూనిట్ – 2 ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు డా. మహేందర్ రెడ్డిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ఎన్ ఎస్ ఎస్ కో- ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.