కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ, సహకార, పౌర సరఫరా, రవాణా, ఐకెపి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.
ప్రతి రైతు ధాన్యంను ప్యాడి క్లీనర్ తో శుభ్రం చేసిన తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు తేమశాతం చూసి కొనుగోలు చేయడానికి అనుమతి పత్రాన్ని ఇవ్వాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి దాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తీసుకు రాగానే వారి పేరు, తీసుకు వచ్చిన ధాన్యం క్వింటాళ్ల వివరాలు రిజిస్టర్లు నమోదు చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతు నుంచి పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ నకలు తీసుకొని ట్యాబ్‌లో నమోదు చేసి డబ్బులు సకాలంలో వచ్చే విధంగా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, ఆర్‌డివో శీను, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జితేంద్ర ప్రసాద్, ఇన్చార్జి డిఎస్‌ఓ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి , జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, జిల్లా సహకార అధికారిణి వసంత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.