ఉన్నత విద్య దిశగా బాలికలను ప్రోత్సహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యను అభ్యసించేలా బాలికలను సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఎరువుల కంపెనీ అయిన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు గురువారం స్థానిక వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేశారు.

మొదటి స్థానంలో నిలిచిన 50 మంది బాలికలకు ఐదు వేల రూపాయల చొప్పున, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ. 3500 చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ, బాలికలను ఉన్నత విద్య దిశగా కోరమాండల్‌ సంస్థ ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని అన్నారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిని చక్కగా చదివించాలని, విద్యాబుద్ధులు నేర్పించడానికి మించిన గొప్ప బహుమతి మరేదీ లేదని గుర్తించాలన్నారు. ఆస్తులు ఇవ్వకపోయినా, చక్కటి విద్యను అందిస్తే సమాజానికి ఉపయోగపడడమే కాకుండా, స్వశక్తితో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకించి బాలికల పట్ల ఎంతమాత్రం వివక్ష ప్రదర్శించకూడదని, మగపిల్లలతో సమానంగా బాలికలను చదివించాలని హితవు పలికారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును మధ్యలో ఆపబోమని బాలికలు కృత నిశ్చయంతో ముందుకు సాగాలని సూచించారు. సెల్‌ ఫోన్‌, సినిమాలు, చెడు స్నేహాలు వంటి వ్యసనాల బారిన పడకుండా విద్యార్థి దశలో చక్కగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తును ఏర్పర్చుకోవచ్చని, తద్వారా కుటుంబ స్థితిగతులను మార్చుకోగల్గుతారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో బాలికలను పై చదువుల కోసం ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని పది జిల్లాలలో వంద మంది చొప్పున ప్రతిభ కలిగిన బాలికలను గుర్తించి నగదు ప్రోత్సాహకాన్ని బాలికల పేరిట ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు అకౌంట్‌లో జమ చేయడం జరుగుతోందని ఆ సంస్థ సహా ఉపాధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి తెలిపారు.

డబ్బులను అవసరమైన సమయంలో డ్రా చేసుకునేందుకు వీలుగా ఏటీఎం కార్డును సమకూరుస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌ వీ .దుర్గాప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌, ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »