నిజామాబాద్, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ తహశీల్ – జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ధరణి విభాగం భవనాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ప్రారంభోత్సవం చేశారు. అన్ని గదులను తిరుగుతూ వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
తహశీల్ కార్యాలయం ఆవరణలో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ తహశీల్ కార్యాలయ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మరో ఏడాది పాటు మొక్కలను ఇదే రీతిలో కాపాడితే, అవి మరింత ఏపుగా పెరిగి చల్లని నీడను అందించే చెట్లుగా ఎదుగుతాయని, పచ్చదనం పెంపొందుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రూరల్ తహసీల్దార్ ప్రశాంత్, రెవిన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు వేణు గౌడ్, కోశాధికారి విజయ్ కాంతారావు, ఉపాధ్యక్షులు భూపతి ప్రభు, తహసీల్దార్లు ప్రసాద్, వరప్రసాద్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.