నిజామాబాద్, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) కు చెందిన 36 గంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న ఆకుల పాపయ్య దౌర్జన్యం నశించాలని యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో పిఎఫ్ కార్యాలయం నుండి యూనియన్ స్థలం వరకు ర్యాలీ చేసి, యూనియన్ స్థలంలో సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో యూనియన్ కార్యక్రమాలు, సమావేశాల కోసం పీ.ఎఫ్ కార్యాలయం ఎదురుగా సర్వేనెంబర్ 1535లో 36 గుంటల భూమిని (ఎకరాన 01లక్షా.85 వేల ధరకు) కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ లావాదేవీలు అప్పటి కౌన్సిలర్ ఆకుల పాపయ్య మధ్యవర్తి అన్నారు. కానీ ఆకుల పాపయ్య యూనియన్ పేరుతో భూమిని రిజిస్టర్ చేయకుండా, తన పేరుతో అక్రమంగా ఆర్.ఓ.ఆర్ చేయించుకున్నాడన్నారు.
ఇందుకు రిఫరెన్స్‌గా సిరికొండ లోని సర్వేనెంబర్ 899 భూమిని చూపించారన్నారు. ఇదంతా రియల్ ఎస్టేట్ మాఫియా చేసే పద్ధతులన్నారు. ఆకుల పాపయ్య చేసిన ఈ చర్యను ఆర్.డి.ఓ నేరంగా ధ్రువీకరణ చేశాడన్నారు. ఇప్పటికైనా పాపయ్య తన తప్పును అంగీకరించి, యూనియన్ కు క్షమాపణ చెప్పాలన్నారు. మరోసారి యూనియన్ స్థలం వైపు కన్నెత్తి చూడద్దొని హెచ్చరించారు. లేదంటే భవిష్యత్తులో యూనియన్ ఆధ్వర్యంలో వేలాదిమంది బీడీ కార్మికులతో ఆకుల పాపయ్య ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న, ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్షులు ఏం.ముత్తన్న, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, సత్యక్క, జిల్లా సహాయ కార్యదర్శి కిషన్, రమేష్, నాయకులు లక్ష్మక్క, వసంత, సావిత్రి, గంగామణి, సుభద్ర, నాగమణి, గోదావరి, సంధ్యారాణి, సవిత, మమత, నాగలక్ష్మి, అన్నపూర్ణ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.