డిచ్‌పల్లి, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ పరిశోధకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ రాజకీయ కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు జీవితంపై రచించిన ‘‘విలక్షణ పివి’’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయనాయుడు హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. రచయితను అభినందించారు.
ఉపరాష్ట్రపతి తన గ్రంథాన్ని ఆవిష్కరించడం పట్ల డా. జి. బాల శ్రీనివాస మూర్తి అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంలో తాను ఇది వరకు సంపాదకత్వం వహించిన గ్రంథాలను ఉప రాష్ట్రపతికి సగౌరవంగా అందించారు. ‘‘విలక్షణ పివి’’ గ్రంథాన్ని ప్రచురించిన నీల్ కమల్ పబ్లికేషన్స్ అధినేత, ప్రచురణ కర్త సురేష్ చంద్ర శర్మ ఉపరాష్ట్రపతికి గ్రంథ విశిష్టతను వివరించారు. దాదాపు 50 గ్రంథాలను అధ్యయనం వేసి సమగ్రమైన పివి స్వరూపాన్ని, స్వభావాన్ని ఆవిష్కరించారని రచయితను అభినందిస్తూ ఉపరాష్ట్రపతికి వివరించారు.
గ్రంథానికి ముందు మాట రాసిన ప్రసార భారతి పూర్వ సిఇఒ రిటైర్డ్ ఐఎఎస్ సీనియర్ అధికారి కంబంపాటి సుబ్రహ్మణ్య శర్మ కూడా పాల్గొన్నారు. బాల శ్రీనివాసమూర్తి రచించిన ‘‘విలక్షణ పివి’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించడం పట్ల తెలంగాణ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.