రెంజల్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం దండిగుట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రం ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
కాగా, ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరిస్తున్నారు, రోజువారీగా ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు పంపిస్తున్నారు తదితర వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణలో ఎఫ్ ఏ క్యూ నిబంధనలను తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలన్నారు. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం వేయించాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యం అకాల వర్షాలకు తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని అన్నారు. నిర్ణీత గడువు లోగా రైతుల నుండి పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ జరిపేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. కలెక్టర్ వెంట మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.