నిజామాబాద్, ఏప్రిల్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ అండ్ వర్కర్లకు రొటేషన్ పద్ధతిలో విధుల మినహాయింపు ఇవ్వాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ ఈరోజు నుండి అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు పదవతరగతి మినహా సెలవులు ప్రకటించారన్నారు.
పదవ తరగతి విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు ఉన్నందున అప్పటివరకు రోజుకు ఇద్దరు టీచర్లు మాత్రమే విధులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కానీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్లకు విధుల మినహాయింపు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కేవలం పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులు మాత్రమే ఉన్నందున నాన్ టీచింగ్ అండ్ వర్కర్లకు కూడా రొటేషన్ పద్ధతిలో విధులను కేటాయించి, మిగతా రోజుల్లో విధుల మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే పని భారంతో, అతి తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్న నాన్ టీచింగ్ అండ్ వర్కర్లకు మానవతా దృక్పథంతో కాస్త ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ అండ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయాలని, జీవో నంబర్ 60 అమలు చేసి వేతన పెంపుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి ఎం.వెంకన్న ఉన్నారు.