నిజామాబాద్, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశలో ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే, జీవితమంతా సుఖసంతోషాలతో గడపవచ్చని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. విద్య అనే ఆయుధాన్ని అనుకూలంగా మల్చుకుంటే, ఉన్నత స్థానంలో స్థిరపడి కుటుంబ తలరాతను మార్చుకోవచ్చని సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల బీసీ హాస్టల్‌లో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులకు పదవ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. కోవిడ్ కారణంగా గడిచిన రెండు సంవత్సరాలు వార్షిక పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యారని, ప్రస్తుతం ఏకంగా ఎస్సెస్సీ బోర్డు ఎగ్జామ్ రాయాల్సి వస్తున్నందున బాగా చదువుకోవాలని హితవు పలికారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు పదవ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభం లోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాలా సంసిద్దులు కావాలని సూచించారు.
ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షలు సమీపించినందున పూర్తిగా చదువుపైనే దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతీసారి తల్లితండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు.
సినిమాలు, సెల్ ఫోన్ వంటి వాటిని పక్కన పెట్టాలన్నారు. జీవితంలో వినోదం ఉండాలి తప్ప, జీవితమే వినోదంగా మారిపోకుండా చూసుకోవాలని అన్నారు. పాఠాలను బట్టీ పట్టకుండా విషయం పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని సూచించారు. ఏ చిన్న కారణంతోనో చదువును మానివేయకూడదని, ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణిస్తే తల్లితండ్రులు పై చదువులు చదివిస్తారని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడుల్లో చదివే వారు ఏ విషయంలోనూ ఎవరికంటే తక్కువ కాదని, ఎవ్వరు కూడా ఆత్మన్యూనతా భావానికి లోను కాకూడదని విద్యార్థుల్లో కలెక్టర్ భరోసా నింపారు.
కాగా, విజయానికి అడ్డదారి అంటూ ఏదీ ఉండదని, అంకితభావంతో కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించగల్గుతామని పేర్కొన్నారు. కాపీయింగ్ వంటి అసంబద్ధ చర్యలతో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా, తప్పు చేశామని భావం మనసులో మెదులుతూనే ఉంటుందన్నారు. కష్టపడితే దక్కే విజయంతో లభించే ఆనందం అనిర్వచనీయ అనుభూతిని అందిస్తుందన్నారు. చక్కగా చదువుకుని అందరూ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ విద్యార్థులను కోరారు.
ఇదిలా ఉండగా, పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునఃశ్చరణ జరిపించాలని ఉపాధ్యాయులను, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు అవసరమైన వసతి సదుపాయాలూ కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.