నిజామాబాద్, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీరందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తో కలిసి ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ మండలాల పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అటవీ శాఖ అధికారులకు, ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. హరితహారం మొక్కలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నామని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మొక్కలకు నీరందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా మొక్కల సంరక్షణ కోసం పడిన కష్టం, పెద్ద ఎత్తున వెచ్చించిన నిధులు వృధా అవుతాయని అన్నారు.
ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, ఇది గ్రామ పంచాయతీల బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ట్యాంకర్ లు సమకూర్చకపోతే వాటిని వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఏ ఒక్క మొక్క ఎండిపోయినా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు.
కాగా, మొక్కలను ధ్వసం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను జూన్ రెండో వారం నాటికి నాటేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట అటవీ శాఖ అధికారులు, ఆయా మండలాల ఎంపీడీవోలు ఉన్నారు.