గాంధారి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తగు నీరు అందించే పథకం అని,అలాంటి పథకం అమలు కావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సురేందర్ హాజరైయ్యారు.
ఈ సందర్బంగా మండంలోని వివిధ శాఖల పనితీరుపై చర్చించారు.మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తగు నీరు అందిస్తున్నామని పత్రికలలో చూడడమే తప్ప ఎక్కడా నీటి సరఫరా కావడం లేదని సభ్యులు ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఒక్క ఇంటికి కూడా నీరు రావడం లేదని స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ అడిగారు. దీనిపై అధికారుల దగ్గరనుండి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో ఎమ్మెల్యే సురేందర్ కలుగ జేసుకొని అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవిధంగా వ్యవహరించడం పట్ల అగ్రహించారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటిని అందించే బాధ్యత అధికారులది అన్నారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నిస్తారని, అలాంటిది నాయకులతో కలుపుకొని అధికారులు పని చెయ్యాలని హితవు పలికారు. ఇక ముందు ఎక్కడా నల్లాల ద్వారా నీరు రావడం లేదనే పిర్యాదు రాకుండా చూడాలని అధికారులకు హెచ్చరించారు. వారం రోజులలో సమస్యను పరిష్కరించాలని అన్నారు. తర్వాత విద్యుత్ శాఖ పనితీరు కూడా బాగా లేదని అన్నారు. అందుకొరకే ఈ సమావేశానికి విద్యుత్ శాఖ జిల్లా అధికారులను పిలువడం జరిగిందని అన్నారు.
విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషా రావు సభ్యులు అడిగిన సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మండలంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు తొందరగా తీరుస్తామని అన్నారు. వ్యవసాయం, అటవీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సోషల్ వెల్ఫేర్, వైద్యం, ఉపాధి హామీ, అంగన్వాడీ, విద్యా, రెవిన్యూ తదితర శాఖల పని తీరుపై మండల సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భజన్ లాల్, సొసైటీ చైర్మన్ సాయికుమార్, ఎంపీటీసీలు పత్తి శ్రీనివాస్, బాలరాజ్, ఎంపీడీఓ సతీష్, తహసీల్దార్ గోవర్ధన్ వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.