ఉద్యోగ సాధనే ఆశ..శ్వాస కావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ సాధనే ఆశ..శ్వాసగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అభ్యర్థులకు సూచించారు. గ్రూప్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్న వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో గెలుపు ఓటములకు మధ్య కేవలం ఒక్క మార్కు తేడా మాత్రమే ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు.

ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలైన దృష్ట్యా సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఇదివరకటితో పోలిస్తే ఉద్యోగాల సాధనకు ఇది ఎంతో అనుకూల సమయం అని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏకకాలంలో పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మల్టీ జోన్‌ విధానాన్ని అమలులోకి తెచ్చి స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.

ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో ఉద్యోగాల ఎంపికలో ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తొలగించిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిభ కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతీ యువకులకు సంబంధిత శాఖల స్టడీ సర్కిల్స్‌ ఆధ్వర్యంలో ముందస్తుగా ఉచిత శిక్షణ తరగతులను సైతం నిర్వహింపచేస్తున్నామని పేర్కొన్నారు. ఎంతో నాణ్యమైన మెటీరియల్‌ అందించడంతోపాటు నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు.

ఈ అంశాలన్నీ ఉద్యోగ సాధనకు ఎంతో అనుకూలంగా నిలుస్తాయని అన్నారు. అయితే అభ్యర్థులు కష్టపడి చదివినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితం దక్కుతుందని అన్నారు. చక్కటి ప్రణాళికను రూపొందించుకొని అందుకు అనుగుణంగా సన్నద్ధమైతే తప్పనిసరిగా విజయం సాధిస్తారని కలెక్టర్‌ అభ్యర్థులకు భరోసా కల్పించారు. ఎలాగైనా సక్సెస్‌ సాధిస్తామని గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పోటీపరీక్షలకు ప్రిపేర్‌ కావాలని సూచించారు. లక్ష్య సాధన దిశగా ముందుకెళ్తున్న తరుణంలో వచ్చే చిన్న చిన్న అవరోధాలను ఎంతమాత్రం పట్టించుకోవద్దని అన్నారు.

సమస్యలకు స్థానం కల్పిస్తే అవి మన లక్ష్యాన్ని దెబ్బతీస్తాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. పోటీ పరీక్షలు పూర్తయ్యేంత వరకు మొబైల్‌ ఫోన్‌, ఫేస్బుక్‌, వాట్సప్‌ వంటి వ్యాపకాలకు దూరంగా ఉండాలని, ఎంతో విలువైన సమయం వృధా కాకుండా ప్రతి నిమిషాన్ని పరీక్షల సన్నద్ధత కోసమే వినియోగించుకోవాలని హితవు పలికారు. రెండు పడవల ప్రయాణం చేస్తే లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అందువల్ల ప్రస్తుతం తాత్కాలికంగా చేస్తున్న ఇతర పనులను పక్కన పెట్టి పూర్తి సమయాన్ని పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ కోసమే కేటాయించాలని అభ్యర్థులకు సూచించారు.

ప్రతి సబ్జెక్టును అన్ని కోణాల్లో చదివి బాగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని, పక్కాగా నోట్స్‌ తయారు చేసుకోవాలని సూచించారు. మంచి ప్రణాళిక, దానికి తగినట్టుగా సన్నద్ధత ఉంటే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా విజయం వరిస్తుందని, జిల్లా నుండి అత్యధిక మంది గ్రూప్‌ ఎగ్జామ్స్‌ లో ప్రతిభను చాటి అత్యధిక ఉద్యోగాలు జిల్లాకు సాధించి పెట్టాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »