నిజామాబాద్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరును గాడిన పెట్టే చర్యల్లో భాగంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సాయంత్రం ఆ శాఖ అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయి నుండి మొదలుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పనులను పూర్తి అంకితభావంతో సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
నిర్దిష్ట గడువులోగా అన్ని కార్యక్రమాల అమలులో స్పష్టమైన ప్రగతిని సాధించి చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పీహెచ్‌సీ, సబ్ సెంటర్‌ల స్థాయిలో పర్యవేక్షణ కొరవడిరదని, ఫలితంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా అమలయ్యే కార్యక్రమాల్లో ఆశించిన ప్రగతిని సాధించలేక పోతున్నామని కలెక్టర్ అన్నారు. దీనిని ప్రైవేట్ ఆస్పత్రి వారు అనుకూలంగా మలుచుకుని పేషెంట్లను వారి వైపు మళ్లించుకుని ఎనలేని ఆర్థిక భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పీహెచ్‌సి స్థాయిలో మెడికల్ అధికారి సూపర్వైజర్ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తమ ఉద్యోగాన్ని దైవంతో సమానంగా భావించాలని అన్నారు. ఇక నుంచి శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. విధులు నిర్వర్తించడంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారు సంతోషంగా పక్కకు తప్పుకోవాలని కలెక్టర్ కటువుగానే సూచించారు. అంతే తప్ప విధుల్లో కొనసాగుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
వైద్య ఆరోగ్య శాఖ పనితీరు సక్రమంగా లేకపోతే ప్రజా జీవనంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమిష్టిగా, సమన్వయంతో పని చేస్తూ సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ హితవు పలికారు. డీ ఎం హెచ్ ఓ నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు తన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళకూడదని కలెక్టర్ మరోమారు స్పష్టం చేశారు. ఎవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోయినా చర్యలు కఠినంగానే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి పి.హెచ్.సి, సబ్ సెంటర్లలో కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ వసతిని సమకూర్చుకోవాలని, ఇంటర్నెట్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకోవాలని, తాగునీటి వసతి తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వీటికోసం ఆస్పత్రి అభివృద్ధి నిధులను వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు.
తాను తనిఖీకి వచ్చిన సమయంలో వసతులు లేనట్లు గమనిస్తే సంబంధిత వైద్య అధికారిని బాధ్యుడిగా పరిగణిస్తామని అన్నారు. ఆస్పత్రిలో పనికిరాని వస్తువులను అట్టి పెట్టకుండా నిబంధనలను పాటిస్తూ తాసిల్దార్ లకు అప్పగించాలని సూచించారు. ఆకట్టుకునే రీతిలో పి.హెచ్.సి, సబ్ సెంటర్ల రూపురేఖలు మార్చాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. పీహెచ్‌సి పరిసరాలతో పాటు వైద్య పరికరాలను రోజువారీగా శుభ్రంగా ఉంచేందుకు వీలుగా అవసరమైతే వర్కర్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రైవేటుకు ధీటుగా అంతకుమించి కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా సిద్ధమై ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పీహెచ్‌సి లోను ఫార్మసీ, ల్యాబ్‌లను చక్కదిద్దుకోవాలని, హెచ్‌బి, బ్లడ్, షుగర్ ర్యాండమ్, హెపటైటిస్ బి, హెచ్‌ఐవి, బ్లడ్ గ్రూపింగ్, మలేరియా వంటి పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. స్థానికంగా పనిచేసే వారిలో ఒకరికి ల్యాబ్ టెక్నీషియన్‌గా శిక్షణ ఇప్పించాలి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, వైద్యాధికారులు, ఆయా విభాగాల బాధ్యులు పాల్గొన్నారు.