పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్‌, ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై గురువారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేనలతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేపట్టిన చర్యల గురించి కలెక్టర్‌ నారాయణ రెడ్డి వారి దృష్టికి తెచ్చారు. మే 6 నుండి 24వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 35 వేల 522 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వీరిలో 17 వేల 553 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయనుండగా, 17 వేల 969 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

మే 23 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు సంబందించి కూడా అన్ని ఏర్పాట్లతో సన్నద్ధమై ఉన్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తుకు ఆదేశించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని పరీక్ష సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల మధ్యన ప్రశ్న పత్రాల బండిల్స్‌ తెరిచేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ వివరించారు.

పరీక్షల సామాగ్రిని వెంటదివెంట కేంద్రాలకు చేరవేస్తూ, పరీక్షలు ముగిసిన మీదట సీల్‌ చేసిన ఆన్సర్‌ షీట్‌ బండిళ్లను మూల్యాంకన కేంద్రాలకు వేగంగా పంపించేలా కృషి చేయాలని పోస్టల్‌ శాఖ అధికారులకు సూచించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా, సరిపడా ఫర్నిచర్‌ సమకూర్చుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్‌ లతో పాటు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమిస్తున్నామని వివరించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోగల అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తామని తెలిపారు అన్ని కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూస్తామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ కరోనా తీవ్రత వల్ల గడిచిన రెండు సంవత్సరాల నుండి వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోయామని అన్నారు. రెండేళ్ల విరామం తర్వాత విద్యార్థులు ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షలు రాస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. మండుటెండలలో పరీక్షలు జరుగనున్నందున విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రధానంగా పరీక్ష సమయాలకు అనుగుణంగా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలన్నారు. పరీక్షల విషయమై మానసిక ఆందోళనకు లోనయ్యే విద్యార్థులు ఆ సమస్య నుండి బయటపడేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18005999333 కు కాల్‌ చేసి మానసిక వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పొందవచ్చని అన్నారు.

ప్రశ్న పత్రాలు లీకేజీ అయినట్లు, ఇతరత్రా వదంతులు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాటివల్ల పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్‌ కమిషనర్‌ కె ఆర్‌. నాగరాజు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌, జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌, డిఈఓ దుర్గాప్రసాద్‌, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »