వేల్పూర్, ఏప్రిల్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమంతో పాటు వారు ఆర్దికంగా వృద్ది సాధించడమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా డిఆర్‌డిఎ పి.డి చందర్ నాయక్, నియోజకవర్గ సిబ్బందితో ఐకేపీ పథకాలపై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
మండల సమాఖ్య ద్వారా కస్టమర్ హైరింగ్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని, వరికోత యంత్రం, పసుపు ఉడకబెట్టి మిషన్ వంటి యంత్రాలను మండల సమాఖ్య ద్వారా కొనుగోలు చేసి రైతులకు తక్కువ ధరకే అద్దెకి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఐకేపీ ద్వారా అందించే బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని,ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మహిళా సంఘానికి పది లక్షల నుంచి 20 లక్షల వరకు రుణం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు.అర్హులైన మహిళా సంఘాలకు రుణాలు అందేలా చూడాలన్నారు.బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న రుణాల ద్వారా మహిళలు నూతన వ్యాపారాలు ఏర్పాటు చేసేలా చూడాలని, జిల్లాలో 806 గ్రామ మహిళా సమాఖ్యలు ఉండగా, ఒక్కో గ్రామ సమాఖ్య లో ఐదు నుంచి పది మంది మహిళలు కొత్త వ్యాపారం ఏర్పాటు చేసేలా చూడాలని వీరికి రెండు లక్షల చొప్పున వ్యక్తిగత రుణం అందించాలని సూచించారు.
ఇలా జిల్లా వ్యాప్తంగా 6,200 యూనిట్లు కొత్తగా ఏర్పాటు చేయడానికి ఐకెపి సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఆదాయ వృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా చేసే క్రమంలో లో కొత్త ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రత్యేక లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు, ఇది జిల్లాలో 100 శాతం అమలయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఆహారశుద్ధి పరిశ్రమలో భాగంగా 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించవచ్చని దీనికి 35 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీ ఉంటుందన్నారు.నిరుద్యోగ యువతకు ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని, దీనికి సమాంతరంగా ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి కల్పించే విధంగా భారీ జాబ్ మేళాకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
మహిళా సంఘాల ద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లాలో మహిళా సంఘాల పనితీరు చాలా చక్కగా ఉందని, ఐకెపి సిబ్బంది కొనుగోలు కేంద్రాల నిర్వహణ తో పాటు క్షేత్రస్థాయిలో చక్కగా పని చేస్తున్నారని మంత్రి అభినందించారు. ఈ సంవత్సరం ఐకెపి ద్వారా మరింత వేగంగా మహిళా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందితో అన్నారు.
కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి చందర్ నాయక్, ఏపిడి మధుసూదన్, డిపిఎం నూకల శ్రీనివాస్, ఏపీఎంలు కుంట గంగారెడ్డి, కిరణ్, ప్రమీల, పుప్పాల గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు.