నిజామాబాద్, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను మంగళవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రగతి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. సమాజంలోని రుగ్మతలను పారద్రోలడానికి ఆనాడు కృషిచేసిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కోవలో బసవేశ్వర చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. మహనీయుల ఆలోచన విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు, సమాజం నుండి చెడు దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో సమాజ హితం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.