నిజామాబాద్, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు కోసం సమాయత్తం అయ్యేందుకు వీలుగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 6వ తేదీన (శుక్రవారం) వానాకాలం సాగు సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.
మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో గల ఫంక్షన్ హాల్‌లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమయ్యే సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి హాజరవుతారని, ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్‌లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొంటారని వివరించారు.
ఆయా గ్రామాల రైతు బంధు సమితి సమన్వయకర్తలు, మండల రైతుబంధు కోఆర్డినేటర్లు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు (జెడ్‌పిటిసిలు) వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్) చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.