కామారెడ్డి, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్ అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణిలో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు.
వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణి కి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున వడ దెబ్బ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కలిపించాలని వైద్య, పంచాయతీ అధికారులను ఆదేశించారు. సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 72 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ప్రజావాణిలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.