నిజామాబాద్, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బొమ్మెర స్వరూప,ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (భర్త క్యాతం సిద్దిరాములు,న్యాయవాది, పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక గొంతుక), కామారెడ్డి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం 3.20 నిమిషాలకు ఇంటి వద్ద మరణించారు. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ కు ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు.
ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది వి. రఘునాథ్ మాట్లాడుతూ స్వరూప బాధ్యత కలిగిన ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, సమాజ నిర్మాణం కోసం పని చేశారన్నారు. స్వరూప భర్త సిద్ధిరాములు అడ్వకేట్‌గా ప్రజల కోసం సమసమాజం కోసం పని చేస్తున్నారన్నారు. స్వరూప మృతిచెందిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే ఆలోచించడం గొప్ప విషయమన్నారు.
స్వరూప భౌతిక కాయాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విద్యార్థుల ప్రయోగం కోసం, తద్వారా సమాజం కోసం ఇవ్వడం ఆదర్శనీయం అన్నారు. ఒక మనిషి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దేహాన్ని పూడ్చడం, కానీ కాల్చడం కానీ చేయడం సాధారణమేనన్నారు. మెడికల్ కాలేజీకి శరీరాన్ని అప్పగిస్తే విద్యార్థులకు ప్రయోగాలకు, నేర్చుకోవడానికి మనిషి యొక్క దేహము ఉపయోగపడుతుందన్నారు.
ఇది కుటుంబ సభ్యులు చైతన్యంతో తీసుకున్న నిర్ణయమన్నారు. ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం సమాజానికి ఆదర్శం కావాలని, ప్రజలు ఇలాంటి వాటిని ప్రోత్సహించాలనీ ఆస్పత్రి వైద్యులు చంద్ర శేఖర్ కోరారు. ఈ సందర్భంగా స్వరూప కుటుంబ సభ్యులను, బంధువులను అభినందించారు. ఆనంతరం ఆసుపత్రికి స్వరూప మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు.
ఈ సందర్భంగా వైద్యులు వైద్య విద్యార్థులు స్వరూప కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్వరూప భర్త సిద్ధిరాములు, కూతురు చలన, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, నాయకులు బాలరాజు, భూమయ్య, వెంకన్న, సంధ్యారాణి, దేవరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.