నిజామాబాద్, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ వెంటదివెంట సంబంధిత సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్‌లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు.
ఇదిలావుండగా, హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తూ బ్లాక్ ల వారీగా నివేదిక అందించాలన్నారు. హరితహారం లక్ష్య సాధన కోసం ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.