ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలి

నిజామాబాద్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు అన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఒక్కో పి.హెచ్‌.సి వారీగా సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, పని తీరులో వెనుకబడి ఉన్న వారిని సున్నితంగా మందలించారు. గడిచిన వారంలో జిల్లా వ్యాప్తంగా 346 కాన్పులు జరుగగా, అందులో అత్యధికంగా 191 కాన్పులు ప్రైవేట్‌ ఆస్పత్రిలోనే అయ్యాయన్నారు. ప్రభుత్వాసుపత్రిలో కేవలం 43 శాతం డెలివరీలు మాత్రమే అయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు రావాలని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రాధాన్యత అంశంగా భావించాలన్నారు. నూటికి నూరు శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా పక్కగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

ఎవరికి వారు క్షేత్ర స్థాయి నుండి పై స్థాయి వరకు తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తే పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుండి కాన్పు అయ్యేంతవరకు ఆమె ఆరోగ్య పరిరక్షణ పట్ల ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్‌ ఆఫీసర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీకి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంల వేతనాల్లో కోత విధిస్తామన్నారు. గర్భిణీల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కాన్పులు చేస్తూ, ప్రభుత్వం తరఫున కెసిఆర్‌ కిట్‌ రూపంలో లబ్ది చేకూరుస్తున్నప్పటికీ, గర్భిణీలు ప్రైవేట్‌ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు అంటే అది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సిబ్బంది సేవల లోపం అని అని భావించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల విషయంలో రాష్ట్ర సగటు కంటే మరింత మెరుగ్గా జిల్లా ప్రగతి ఉండాలన్నారు.

ఇకనైనా నాణ్యమైన సేవలందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తే, నూటికి నూరు శాతం గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకునేందుకు ముందుకు వస్తారన్నారు. అదేవిధంగా కాన్పు జరిగిన వెంటనే కెసిఆర్‌ కిట్‌ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌, టెలీ మెడిసిన్‌, 102, 108 సేవలు, మాతా శిశు సంరక్షణ, క్షయ నివారణ తదితర అంశాల్లోనూ మరింత ప్రగతి సాధించాలని సూచించారు.

ప్రతి వారం తాను వైద్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని, పనితీరు మెరుగుపరుచుకోని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు అటెండెన్స్‌ యాప్‌ ద్వారానే తమ హాజరును నమోదు చేసుకోవాలని సూచించారు. దాని ఆధారంగానే వేతనాలు చెల్లించబడతాయని కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌, ఎంసిహెచ్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అంజన, ఏఓ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »