కామారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. చిన్నారుల బరువు, ఎత్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు.
గర్భిణీలు, తల్లులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయవద్దని గర్భిణీలను కోరారు. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
నేత్ర వైద్య పరీక్షలు యంత్రం ద్వారా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రిలో లో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల కొరత ఉందని ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టు పద్ధతిలో త్వరలో వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
బ్లడ్ బ్యాంకు ద్వారా సేకరించిన రక్తం నిల్వలను పరిశీలించారు. పట్టణంలోని షెడ్యూల్డ్ కులాల వసతిగృహాన్ని పరిశీలించారు. ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి మౌలిక వసతుల గురించి జిల్లా షెడ్యూల్ కులాల అధికారిని రజిత ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.