మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర మరమ్మతు పనులను వేగవంతం చేస్తూ, సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి హాస్టల్‌ లో తప్పనిసరిగా తాగునీరు, నీటి వసతితో కూడిన టాయిలెట్స్‌ అందుబాటులో ఉండేలా చూడాలని, విద్యుదీకరణకు సంబంధించి కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా పనులు జరిపించాలన్నారు. జూన్‌ 12 వ తేదీ నుండి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నందున, జూన్‌ 5 వ తేదీ లోపే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గడువు విధించారు. నాణ్యతా లోపాలకు తావులేకుండా పనులను పర్యవేక్షించాలని సూచించారు.

మరమ్మతు పనులకు సంబంధించి నిధులు సిద్ధంగా ఉన్నాయని, పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి వసతి గృహాన్ని అవసరమైన అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దాలని, హాస్టల్‌లలో పూర్తి స్థాయిలో విద్యార్థుల అడ్మిషన్‌లు జరిగేలా సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ గురించి కలెక్టర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పోలీస్‌ ఉద్యోగాలతో పాటు, గ్రూప్‌ ఎగ్జామ్స్‌ కోసం అందిస్తున్నఉచిత శిక్షణకు వివిధ కారణాల వల్ల కొంతమంది అభ్యర్థులు హాజరు కావడం లేదని సంక్షేమ శాఖ అధికారులు తెలుపగా, అర్హులైన ఇతర అభ్యర్థులకు నిర్ణీత సీట్ల సంఖ్యకు అనుగుణంగా ప్రవేశాలు కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. శిక్షణ తరగతుల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఉండాలని అన్నారు. అభ్యర్థులు కోరుకున్న మెటీరియల్‌ను సేకరించి తక్షణమే అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిని శశికళ, బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి నర్సయ్య, గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి నాగోరావ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఈ.ఈ దేవిదాస్‌, పంచాయతీరాజ్‌ ఈ .ఈ శంకర్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »