కామారెడ్డి, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కష్టపడేతత్వం ఉంటే సులభంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చని సూచించారు. నిత్యం సాధన చేయాలని కోరారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. 75 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కామారెడ్డి నియోజికవర్గంలోని అరు మండలాలకు చెందిన 1201 మంది విద్యార్థులు అర్హత పరీక్ష రాసినట్లు చెప్పారు. వీరిలో 516 మంది విద్యార్థులు అర్హత సాధించారని, వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వసతి కల్పించినట్లు తెలిపారు.75 లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
శిక్షణలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో సన్మానం చేయిస్తానని తెలిపారు. సమావేశంలో ఎస్పి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా తెరాస అధ్యక్షుడు ముజిబోద్దీన్, ఎంపీపీ ఆంజనేయులు, వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి, తెరాస నాయకుడు నిట్టు వేణుగోపాలరావు, శౌర్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ నరేష్, ప్రశాంత్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.