నిజామాబాద్, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వెలువరిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీ, యువకులు అధిక సంఖ్యలో ఉద్యోగాలను సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరప చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాలు, పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అభ్యర్థులకు తనదైన శైలిలో ప్రేరణ కల్పించారు. సివిల్స్ సాధన కోసం తాను పడిన శ్రమ గురించి, సన్నద్ధమైన తీరుతెన్నుల గురించి కలెక్టర్ ఈ సందర్భంగా వివరిస్తూ ఉద్యోగార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. సేద్యపు రంగంతో పాటు ఇతర అనేక అంశాల్లో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను చాటుకుంటోందని గుర్తు చేశారు. అదే కోవలో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను నిజామాబాద్ యువత దక్కించుకుని ఉద్యోగాల సాధన లోను జిల్లాకు ముందంజలో నిలపాలని ఆకాంక్షించారు.
స్థానిక కోటలోనే కాకుండా జోనల్, మల్టీ జోనల్ పోస్టులలోనూ జిల్లాకు చెందిన అభ్యర్థులే ఎక్కువ ఉద్యోగాలను దక్కించుకోవాలన్నారు. ప్రభుత్వం 80 వేల పైచిలుకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న దరిమిలా, ఈ సువర్ణ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళితేనే విజయతీరాలకు చేరుకోవచ్చని సూచించారు. సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా సిలబస్ పైనే పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తూ పట్టుదలతో చదవాలని అన్నారు.
ఇష్టంగా చదివితే అది ఎంతమాత్రం కష్టంగా అనిపించదని అన్నారు. తమ శక్తియుక్తులన్నీ కూడగట్టి ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాసేవారే విజేతలుగా నిలుస్తారని సూచించారు. పోటీ పరీక్షల సన్నద్ధతకు ఆటంకం కలిగించే అనవసర వ్యాపకాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ హితవు పలికారు. ఉద్యోగ సాధన లక్ష్యం నెరవేర్చుకున్న మీదట జీవితానికి స్థిరత్వం వస్తుందని, అప్పుడు సరదాలు, వినోదాల వైపు దృష్టి సారించవచ్చని అన్నారు. పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలంటే విషయ పరిజ్ఞానంపై పూర్తి అవగాహన, పట్టును సాధించాలన్నారు.
ఒక్క మార్కు తేడాతో విజేతలుగా నిలిచే అవకాశాన్ని చేజార్చుకునే ప్రమాదం ఉన్నందున, ఎదుటి వారి కంటే మనం ఎక్కువగానే సన్నద్ధతపై దృష్టి సారిస్తే తప్పనిసరిగా ఉద్యోగ నియామకాల జాబితాలో స్థానం పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలోనే కాకుండా జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తోడ్పాటుతో ఉద్యోగార్థులకు అనేక వసతులతో కూడిన నాణ్యమైన కోచింగ్ అందించడం జరుగుతోందన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి ప్రీ కోచింగ్ విషయంలో పోలీస్ కమిషనర్ నాగరాజు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
ముందస్తు శిక్షణ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జిల్లాకు అత్యధిక కొలువులు సాధించి పెట్టాలని కలెక్టర్ కోరారు. ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం అవడంతో పాటు చక్కగా పరీక్షలను రాసినప్పుడే మెరిట్ సాధించగలరని సూచించారు. అతి విశ్వాసాన్ని వీడి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని అంకితభావంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ కె ఆర్. నాగరాజు మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో యువత ముందుకు వచ్చి సన్నద్ధం అవుతుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. తాను కూడా పోలీసు ఉద్యోగం పట్ల ఎనలేని ఆపేక్షతో స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో చేరానని తెలిపారు. పోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అయినందున, అభ్యర్థులు ఎంతో క్రమశిక్షణతో కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా కాకుండా పూర్తి పట్టుదలతో, ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం దక్కుతుందన్నారు.
స్వామి వివేకానంద వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనిషి మేధస్సు ఎంతో శక్తివంతమైన ఆయుధంతో సమానమైనదని, దానిని సరైన రీతిలో వినియోగించుకొని ఉద్యోగ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని హితవు పలికారు. అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకుంటే తప్పనిసరిగా ఫలితం లభిస్తుందని సూచించారు. మీపై మీకు గట్టి నమ్మకం ఏర్పరచుకోవాలని, మీకు మీరే పోటీ అని భావిస్తూ సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ కోచింగ్ అకాడమీలకు చెందిన డైరెక్టర్లు సి ఎస్ వేపా, బాలలత, టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, నమస్తే తెలంగాణ పత్రిక ప్రతినిధులు, యువతీ, యువకులు పాల్గొన్నారు.