నిజామాబాద్, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో మున్సిపల్, నీటి పారుదల, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్ హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లాలో హరితహారం అమలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు.
జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి సంరక్షణకై చేపడుతున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి, నిజామాబాద్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించడం జరిగిందన్నారు. ఇకముందు కూడా ఇదే స్పూర్తితో పని చేస్తూ హరితహారం విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు. జాతీయ రహదారులతో పాటు, సర్వీస్ రోడ్లు, ఇతర అన్ని చోట్లా ఇప్పటికే నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించేలా చొరవ చూపాలన్నారు.
ప్రధానంగా చెరువులు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు వీలుగా ఖాళీ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా కబ్జాలు ఉంటే నివేదికలో వాటి వివరాలను కూడా పొందుపర్చాలని సూచించారు. ఇదివరకు నాటిన మొక్కల స్థితిగతులను పరిశీలించి, ఎక్కడైనా మొక్క ఎండిపోతే దాని స్థానంలో కొత్త మొక్కను నాటించాలన్నారు. కాగా, రహదారులకు ఇరువైపులా ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా చూడాలని, ట్రీ గార్డ్, సపోర్ట్ కర్రలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇంకను ఎక్కడైనా ఖాళీ స్థలాలు మిగిలి ఉంటే ఆ ప్రదేశాల్లోనూ మొక్కలు నాటించి, వాటి సంరక్షణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వీస్ రోడ్లు వేసిన చోట్ల మొక్కలు కొన్ని పాడైనందున, ఆ ప్రదేశాల్లో కొత్త మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి లోపం కనిపించకూడదని, పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
ఇదిలాఉండగా, నిజామాబాద్ నగరంతో పాటు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ పట్టణాలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలు కోసం అర ఎకరం చొప్పున స్థలాలను గుర్తించాలని సూచించారు.
వసతి గృహాల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలి
కాగా, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కనీసం వారం రోజుల ముందే నిర్మాణ, మరమ్మతు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల సంక్షేమాన్ని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సేవా దృక్పధంతో పని చేయాలని హితవు పలికారు.
నూటికి నూరు శాతం నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని, నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ చందర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాభివృద్ధి శాఖల అధికారులు శశికళ, నాగోరావ్, నర్సయ్య, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.