నిజామాబాద్, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వ్వాచ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షల తుది ఏర్పాట్ల పై కలెక్టర్ శనివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రభావం వల్ల గడిచిన రెండు సంవత్సరాలుగా వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం యధావిధిగా పరీక్షలు కొనసాగనున్నందున ఏ చిన్న సమస్య సైతం ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను లోనికి అనుమతించకూడదని, ఒకవేళ ఎవరైనా తీసుకువస్తే మెయిన్ గేటు వద్దనే దానిని స్వాధీనం చేసుకుని డిపాజిట్ చేసుకునేలా అన్ని సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఎలాంటి అనుమానాలు, విమర్శలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించడంలో పోలీసు శాఖ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్యనే ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, సీసీ కెమెరాల రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాలు తెరవాలని అన్నారు. బయటి వ్యక్తులు ఎవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, పరీక్షా సమయం ముగిసేంత వరకు లోపలి వ్యక్తులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్షలు జరిగే సమయంలో మూసిఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 : 30 గంటల నుండి మధ్యాహ్నం 12 : 45 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నందున విద్యార్థులు కనీసం అర గంట ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.
పరీక్ష ప్రారంభం అయిన మీదట కేవలం అయిదు నిమిషాల వరకే అంటే 9 : 35 నిమిషాల లోపు వచ్చిన వారికి మాత్రమే లోనికి అనుమతిస్తామని, ఆ తరువాత వచ్చే వారు అనుమతించబడరని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 8 : 30 గంటల వరకే చేరుకునేలా తగిన ప్రణాళికతో బస్సులు నడిపించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్ ఎం ఉషాదేవిని ఆదేశించారు.
బస్టాండ్ల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు.పరీక్షలు కొనసాగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆశ వర్కర్, ఏఎన్‌ఎంలను నియమించాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి గదిలోనూ తప్పనిసరిగా విద్యుత్ బల్బు, ఫ్యాన్ పని చేసేలా చూడాలని, ముఖ్యంగా తాగునీటి వసతి, సానిటేషన్‌ను చక్కబెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా తహసీల్దార్, ఎంఈఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎంపీఓ, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారుల పేరు, హోదా, సెల్ ఫోన్ నెంబర్లతో కూడిన వివరాలు అందరికి కనిపించేలా ప్రదర్శించాలని, దీనివల్ల ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించేందుకు వీలుంటుందన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఓఎంఆర్ షీట్స్, ఫర్నీచర్ సరిపడా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎంఈఓలు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి తుది ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పక్కా ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. సెల్ కాన్ఫరెన్సులో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.