కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ళు వేగవంతంగా పూర్తయ్యేలా సంబంధిత తహశీల్దార్లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి వాహనాలు అందుబాటులో ఉన్నవి, లేనివి అనే అంశాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో ఇంచార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా సహకార అధికారి వసంత, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, ఆర్డీవో శీను, తహసీల్దార్లు, డిప్యూటీ తాసిల్దారు, సహకార సంఘాల సీఈఓ పాల్గొన్నారు.