డిచ్‌పల్లి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) కార్యాలయం నుంచి పది మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్, ఒక ప్రోగ్రాం ఆఫీసర్ ముంబయ్‌లో జరుగుతున్న జాతీయ సమగ్రతా శిబిరం (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్) లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినట్లుగా ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబయ్ లో ఈ నెల 22 – 28 వ తేదీ వరకు నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ నిర్వహింపబడుతుందన్నారు.
వీరందరు శనివారం సాయంత్రం నిజామాబాద్ నుంచి బయలుదేరి వెళ్లినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్‌కు తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్, బిక్నూర్ సౌత్ క్యాంపస్, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిశిత డిగ్రీ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల నుంచి ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు షేక్ అజర్, జె. సంజయ్, పి. వివేక్, సిహెచ్. ఓంకార్, మాలావత్ పవన్, రామగిరి గంగోత్రి, ఇలితం బబిత, పుప్పాల వర్ష, పల్లికొండ మౌనిక, ఎం. ప్రవల్లిక హాజరవుతున్నట్లుగా ఆయన తెలిపారు.
వీరందరికి పర్యవేక్షకులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని అన్నారు. క్యాంప్‌లో వాలటీర్స్ జాతీయ సమగ్రతకు అనువైన అంశాలు గల భావనలపై తగిన తర్ఫీదు పొందనున్నట్లు ఆయన వెల్లడిరచారు. సామాజిక, సాంస్కృతిక, వ్యక్తిత్వ నిర్మాణంలో స్వయం సమృద్ధిని పొందుతారని అన్నారు.
దేశభక్తి, సంస్కృతిని పెంపొందించే అంశాలలో వ్యాస రచన, వక్తృత్వం, డ్రామాలు, మూకీలు, ఏకాంకికలు వంటి పోటీలలో పాల్గొంటారని అన్నారు. జాతీయ స్థాయిలో సృజనాత్మక కళను మెరుగుపరుచుకోవడానికి చక్కని వేదికగా ఈ క్యాంప్ తోడ్పడుతుందన్నారు. తమ తమ ప్రతిభను ప్రదర్శించి వివిధ పోటీలలో విజేతలుగా తిరిగివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్‌లో పాల్గొంటున్న ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లందరికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ శుభాభినందనలు తెలిపారు.