నిజామాబాద్, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు కాకతీయ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.
విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అన్నది సి.సి కెమెరా ఫుటేజీల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి ఎవరైనా సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో వచ్చారా అని కలెక్టర్ స్వయంగా పలువురు విద్యార్థులను తనిఖీ చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు.
ఎక్కడ కూడా కాపీయింగ్‌కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్‌కు పాల్పడితే మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలని నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఎంతో అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు నితిన్, మల్లేశం తదితరులు ఉన్నారు.