రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం

బాల్కొండ, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. పోలీస్‌ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన సొంత ఖర్చులతో ముందస్తు శిక్షణ అందజేయిస్తున్నారు. వేల్పూర్‌ మండలం పడిగెల్‌ గ్రామ వడ్డెర కాలనీలో కొనసాగుతున్న శిక్షణా శిబిరంలో అభ్యర్థులకు గురువారం ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డితో కలిసి మంత్రి వేముల అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఏకకాలంలో దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీ కోసం జంబో నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికె దక్కిందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ సెగ్మెంట్‌ తోపాటు నిజామాబాద్‌ జిల్లా నుండి అత్యధిక మంది యువతీ యువకులకు ప్రభుత్వ కొలువులు దక్కాలనే సంకల్పంతో ఖర్చు గురించి ఆలోచించకుండా ముందస్తు కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్‌ లోని కోచింగ్‌ సెంటర్లకు ధీటుగా నిష్ణాతులైన అధ్యాపకులచే బోధన జరిపిస్తూ ఉచిత భోజన వసతిని సమకూరుస్తున్నామని అన్నారు.

అంతేకాకుండా నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ సదుపాయాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలను నెరవేర్చుకోవాలని సూచించారు. మూడు నెలల ముందస్తు శిక్షణలో నెల రోజులు పూర్తయ్యాయని, మిగిలి ఉన్న మరో రెండు నెలల సమయాన్ని వృధా చేయకుండా అకుంఠిత దీక్షతో కష్టపడితే జీవితమంతా ఎలాంటి చింత లేకుండా ఉద్యోగ భద్రతతో ఆనందమయంగా గడప వచ్చని మంత్రి హితవు పలికారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో జోనల్‌ విధానాన్ని పాటించడం వల్ల తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింప చేశారని గుర్తు చేశారు. ఫలితంగా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలను ఖరారు చేస్తూ జీవోను జారీ చేయడం సాధ్యపడిరదని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాల వారీగా ఖాళీలను భర్తీ చేస్తుండడం, ఇంటర్వ్యూ విధానాన్ని తొలగించడం యువతకు వరంగా మారిందన్నారు. ఒక్క నిజామాబాదు జిల్లాలోనే 1997 ఉద్యోగ ఖాళీల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని తెలిపారు. అయితే జిల్లాకు చెందిన అభ్యర్థులు స్థానిక కోటాతో పాటు జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులలోనూ అత్యధిక ఉద్యోగాలు సాధిస్తే తాము పడిన శ్రమకు ఫలితం దక్కిన సంతృప్తి మిగులుతుందన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు పూర్తి న్యాయం జరగాలనే ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా జిల్లాకు కనీసం మూడు వేల కొలువులు సాధించి నిజామాబాదు ప్రతిష్టను ఇనుమడిరపజేయాలని ఆకాంక్షించారు. ముందస్తు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు మాక్‌ టెస్టులు నిర్వహిస్తూ, ఇదివరకటి పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను అందుబాటులో ఉంచాలని కోచింగ్‌ కేంద్రాల సమన్వయకర్త చక్రవర్తికి ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సూచించారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా ఏర్పాటుకు ముందు ఉద్యోగ పోటీ పరీక్షల కోచింగ్‌ అంటే హైదరాబాద్‌లో మాత్రమే ఉండేవని అన్నారు. ప్రస్తుతం మంత్రి ప్రశాంత్‌ రెడ్డి చొరవతో స్థానికంగానే యువతకు అన్ని వసతులతో కూడిన శిక్షణ అందుతుండడం అదృష్టంగానే భావించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ పోటీలో జిల్లాకు చెందిన అభ్యర్థులందరూ విజేతలుగా నిలువాలని ఆకాంక్షించారు. మనం ఏర్పర్చుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడడం తప్ప, అడ్డదారులు ఉండవని సూచించారు. విజయ తీరాలకు చేరాలనే గట్టి సంకల్పంతో మనల్ని మనం అందుకు అనుగుణంగా మల్చుకుని ముందుకెళ్లాలని అన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్య సాధన బాటను వదలకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందన్నారు. సబ్జెక్టులపై పట్టును సాధిస్తూ, సిలబస్‌ మొత్తాన్ని ఆకళింపు చేసుకుంటే పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారని మార్గనిర్దేశం చేశారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనందున సమయాన్ని వృధా చేయకూడదని, సెల్‌ ఫోన్‌ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి పూర్తిగా పోటీ పరీక్షల సన్నద్ధత పైనే దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా ప్రీ కోచింగ్‌ పొందుతున్న పలువురు అభ్యర్థులు తమకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తున్నందున తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామని గట్టి నమ్మకాన్ని వ్యక్తపర్చారు. అన్ని వసతులతో కూడిన నాణ్యమైన శిక్షణ ఏర్పాటు చేయించిన మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి కృత్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఇంచార్జి ఆర్డీవో రాజేశ్వర్‌, ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌, వేల్పూర్‌ ఎంపిపి జమున, జెడ్‌పీటిసీ భారతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »