నిజామాబాద్, మే 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ 3 వ తేదీ నుండి రెండు వారాల పాటు కొనసాగనున్న పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసేనాటికి నిర్దేశిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైకుంఠధామాలలో తప్పనిసరిగా నీటి వసతి, విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశంలో విస్తీర్ణాన్ని బట్టి ప్రతి చదరపు మీటరుకు ఒక మొక్క కనిపించాలన్నారు. డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తను వేరు చేస్తూ తడి చెత్త నుండి కంపోస్ట్ ఎరువు తయారయ్యేలా చూడాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో ఇంకను ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే వెంటనే మొక్కలు నాటాలని, పచ్చదనంతో అలరారేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.
అలాగే, అవెన్యూ ప్లాంటేషన్, చెరువులు, కాల్వ గట్ల పైన విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా పనులు జరిపించాలని ఆదేశించారు. కాగా, ఆసరా పెన్షన్ల పల్లె ప్రగతిలో ఆడిట్ నిర్వహించనున్న దృష్ట్యా పెన్షన్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు లేకుండా పక్కాగా పరిశీలన జరిపించాలన్నారు. అదేవిధంగా పెన్షన్లు తీసుకోలేకపోతున్న వారి వివరాలను ఒక్కో వ్యక్తి వారీగా విచారణ చేయాలని ఆదేశించారు.
ఆరుబయట మలమూత్ర విసర్జనకు వెళ్తున్న వారిని గుర్తించి, సదరు కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉందా లేదా అన్నది ఆరా తీయాలని సూచించారు. పై బాధ్యతలను అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలని, పల్లె ప్రగతి ముగిసే సమయానికి పనులన్నీ పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. వీడియో
కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, డీపీవో జయసుధ, ఆయా శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.