నిజామాబాద్, మే 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. సమావేశానికి యూనియన్ ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య వక్తలుగా వచ్చిన ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, కేజీబీవీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎల్ పద్మ మాట్లాడుతూ కాంటాక్ట్ సిబ్బందిని చేస్తానని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కేజీబీవీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు.
ప్రభుత్వం కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్స్ పట్ల వివక్షతను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. మిగతా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీవో నెం: 60 అమలు చేసిన ప్రభుత్వం, కేజీబీవీల్లో మాత్రం అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇది కేజీబీవీల పట్ల, కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళల పట్ల ప్రభుత్వానికి వున్న చిన్నచూపును తెలియజేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం:60 ని కేజీబీవీ నాన్-టీచింగ్, వర్కర్స్‌కు వర్తింపజేయాలన్నారు. జీ.వో నెం: 60 ప్రకారం కుక్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ వుమెన్ లకు నెలకు 15 వేల 600 రూపాయలు, కంప్యూటర్, ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ లకు 19 వేల 500 రూపాయలు, అకౌంటెంట్, ఏఎన్‌ఎంలకు 22 వేల 750 రూపాయల వేతనాలు పెంచాలన్నారు.
కేజీబీవీల్లో కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. డిమాండ్ మేరకు వర్కర్స్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. వీక్లీ ఆఫ్ లు అమలు చేసి, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్, పీ. డీ.ఎస్.యు జిల్లా
అద్యక్షులు కల్పన, యూనియన్ ప్రతినిధులు ఈశ్వరి, హేమలత, సుమలత, ఉజ్మ, శోభ, నసీమ, లత, రాజమ్మ, గోదావరీ, గంగమ్మ, మమత, సునీత, స్వాతి, లక్ష్మీ భాయి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.