కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశంలో ఉన్న పట్టణాలు, పల్లెల కన్న తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పట్టణాలు ,పల్లెలు సర్వే చేయించగా 10 అభివృద్ధి చెందిన పల్లెలు ,పట్టణాలు తెలంగాణలోని వాటికి లభించాయని చెప్పారు. తర్వాత దేశం మొత్తం మీద 20 గ్రామాలలో సర్వే నిర్వహించగా 19 తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందినట్లు నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వర్తించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పారు. జూన్ 3 నుంచి జరిగే పల్లె, పట్టణ ప్రగతిలో మొదటిరోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని సమస్యలను గుర్తించాలని సూచించారు. గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. గ్రామాల్లోని డంపింగ్ యార్డ్లు , వైకుంఠ ధామాలు 100 శాతం ఉపయోగంలో ఉండేవిధంగా చూడాలని కోరారు.
పవర్ డే రోజు విద్యుత్ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సూచించారు. హరిత హారంలో నాటిన మొక్కల వివరాలపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ 9 శాతం పెరిగితే సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం ప్రతియేటా పెరుగుతోందని చెప్పారు. మొక్కలు పెంచడం వల్ల రాష్ట్రంలో ఆరు శాతం పచ్చదనం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పిందని అన్నారు. 3 శాతం పెంచగలిగితే తెలంగాణలో కరువు ఏర్పడదని స్పష్టం చేశారు.
హరితహారం కింద మొక్కలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను ఎవరు అడగలేదని, సామాజిక స్ఫూర్తితో అడవులలో మొక్కలు పెంచడం వల్ల అడవులు దట్టంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జూన్ 3న ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడల వైపు యువకుల, పిల్లల దృష్టిని మళ్ళించడానికి ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి ప్రాంగణానికి 50 వేల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. యువత, పిల్లలు గ్రామాల్లో అడుకొనే విధంగా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సమస్తలకు అదనంగా నిధులు ఇచ్చి అభివృద్ధి పనులు చేపడుతోందని చెప్పారు. విద్యుత్తు, రోడ్లు, సాగునీరు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, డిసిసిబి అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.