కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో దశలవారీగా మౌలిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గెలాక్సీ ఫంక్షన్హాల్లో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎటువంటి చిక్కులు లేని డిటిసిపి లేఅవుట్ కలిగిన వెంచర్ అని చెప్పారు. ప్లాట్లు, గృహాలు తీసుకున్న వ్యక్తులకు బ్యాంకు అధికారులు రుణాలు అందజేస్తారని పేర్కొన్నారు.
వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ ఉందన్నారు. వెనుక వైపు నుంచి గేటు ఏర్పాటు చేస్తామని సూచించారు. ప్రణాళిక బద్దంగా వెంచర్లో గృహాలు నిర్మించారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శీను, ధరణి టౌన్షిప్ అధికారులు, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.