నిజామాబాద్, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా ఇన్చార్జి కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ.పాపయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్ మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచటం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించకపోవడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. పేదరికం మరింత పెరుగుతుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి మోడీ ప్రభుత్వం ఖజానా నింపుకుంటుదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వేసిన పన్నులు తగ్గించక కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల పైన మరిన్ని భారాలు వేశారని విమర్శించారు. మరొకవైపు ఉపాధి అవకాశాలు తగ్గి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాలతో కార్మికులకు కనీస వేతనాలు అమలు తప్పక యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఉపాధి హామీ నిధులను తగ్గించడంతో పాటు పట్టణాల్లో ఉన్న పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు.
ప్రభుత్వ విధానాలు మార్చుకోని ఎడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు వి.ప్రభాకర్, ఎం. వెంకన్న, కే.గంగాధర్, నూర్జహాన్, సబ్బని లత, సుధాకర్, ఓమయ్య దాసు, భూమయ్య, వరదయ్య, దేవారం, మల్లేష్, రామకృష్ణ, సాయగౌడ్, సుధాకర్, గోవర్ధన్, శ్రీధర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.