నిజామాబాద్, జూన్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె / పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైకుంఠధామం వద్ద జరుగుతున్న పనుల తీరును పరిశీలించి, విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది వివరాలను ఆరా తీశారు.
పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సైతం తనిఖీ చేశారు. ప్రతీ చోట అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల పెంపకం, వాటి నిర్వహణ సరిగా లేకపోవడం, డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించకపోవడం వంటి లోపాలను గమనించిన కలెక్టర్, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శికి మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
తాను పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేలోపు మళ్ళీ తనిఖీకి వస్తానని, పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాల్సిందేనని సూచించారు. అనంతరం నందిపేట మండలం షాపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. కూలీలకు పూర్తి స్థాయిలో వేతనాలు గిట్టుబాటు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.