లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. గట్టి నమ్మకంతో పూర్తి సిలబస్‌ చదవాలని. కష్టాన్ని ఎప్పుడూ ఇష్టంగా భావించి ముందుకెళ్లాలని హితవు పలికారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏకకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్న క్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థులకు రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి మీడియా గ్రూప్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభ్యర్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించింది. కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇటీవలే వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను చాటి ఐఏఎస్‌కు ఎంపికైన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కుమారి అరుగుల స్నేహను, ఆమె తల్లిని కలెక్టర్‌ అభినందిస్తూ సన్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, చదువు మాత్రమే జీవితాన్ని మలుపు తిప్పుతుందని స్పష్టం చేశారు. అయితే ఒక్క ప్రయత్నంతో ఏదీ కూడా ఆపకూడదని, లక్ష్యం చేరే వరకు ప్రయత్నం కొనసాగించాలన్నారు. ప్రాక్టిస్‌ అనేది చాలా ముఖ్యమని, మాడల్‌ పేపర్‌ను గట్టిగా ప్రిపేర్‌ చేసుకోవాలన్నారు.

పరీక్ష రాసినట్టుగానే ఫీలై మాడల్‌ పేపర్‌ రాయాలని తెలిపారు. తాను 2006 సంవత్సరంలో క్యాంపస్‌లో బీఈడీ చేయగా, డీఎస్సీ పరీక్ష రాసి తొలుత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యానని తెలిపారు. అంతటితో ఆగిపోకుండా గ్రూప్స్‌ రాసి ప్రస్తుతం కలెక్టర్‌ స్థాయి వరకు వచ్చానన్నారు. కష్టపడితే మంచి స్థాయిలో ఉండొచ్చని, హార్డ్‌వర్క్‌ చేసే వారికే విజయతం వరిస్తుందనేందుకు నిజామాబాద్‌కు చెందిన అరుగుల స్నేహ ఐఏఎస్‌ సాధించడమే నిదర్శమన్నారు.

స్నేహకు ఆమె తల్లి అందించిన సహకారం ఎంతో గొప్పదని, ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు స్నేహను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వేలాది ఉద్యోగాలకు నోటీఫికేషన్లు వెలువడుతున్నాయని, ఇలాంటి అవకాశం మళ్లీ రాదన్నారు. పోలీస్‌ ఉద్యోగాలు కూడా చాలానే ఉన్నాయని, చాలెంజింగ్‌గా తీసుకుని పోలీస్‌ కొలువులు కొట్టాలని పిలుపునిచ్చారు. మైండ్‌సెట్‌తో పోటీ పరీక్షలకు ప్రిపేరైతే జాబ్‌ కొట్టడం సులువేనని, ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం ఒక్కసారిగా మారిపోతుందన్నారు.

సక్సెస్‌ అనేది చాలా తీయదనంతో కూడి ఉంటుందన్నారు. పోటీ పరీక్షలలో నిజామాబాద్‌ అభ్యర్థులకే ఎక్కువ ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించారు. ప్రధానంగా జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులు కూడా నిజామాబాద్‌కే రావాలని అన్నారు. పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల కోసం ‘సాక్షి’ అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

కష్టపడితే అన్నీ సాధ్యమే…అరుగుల స్నేహ సివిల్స్‌ ఆలిండియా 136 ర్యాంకర్‌

కష్టపడితే అన్నీ సాధ్యమేనని సివిల్స్‌ ఆలిండియా 136 ర్యాంకర్‌ అరుగుల స్నేహ ఆన్నారు. మూడు రోజుల ముందు వరకు నేను కూడా స్టూడెంట్‌నని, ఇప్పుడు సివిల్‌ టాపర్‌గా మీ ముందున్నానన్నారు. నా విజయానికి కారణం అమ్మ, చెల్లె, తమ్ముడు, బాబాయ్‌, పిన్నితోపాటు స్నేహితులేనని తెలిపారు. ఏదో రోజున కలెక్టర్‌గా నిలబడుతానని ఆత్మవిశ్యాసం నాలో ఉండేదన్నారు. అందుకే లక్ష్యాన్ని చేరుకున్నానని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సాధించవచ్చని, ప్రిపరేషన్‌లో ఎన్ని నెలలు చదవినా ఎందుకు ఫెయిల్‌ అవుతున్నామని, ఓటమికి గల కారణాలను తెలుసుకొవాలన్నారు.

సివిల్స్‌ పరీక్ష రాసిన సమయంలో 10 ప్రశ్నలకు సమాధానాలు సక్రమంగా రాయలేదని, దీనికి కారణం ఏమిటని ప్రశ్నించుకున్నారన్నారు. చదవడానికి ఎన్ని గంటలు కేటాయించాలో దాని ప్రకారం సమయం కేటాయించుకున్నాని చెప్పారు. సినిమాలు కూడా చూసేదానినని, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. అయితే మనం సక్సెస్‌ అయితే సోషల్‌ మీడియాలో మనమే ఉంటామన్నారు.

ప్రిపరేషన్‌ సమయంలో వారం,నెలసారి టార్గెట్‌లు పెట్టుకొని ముందుకు సబ్జెట్‌ పూర్తి చేశానని, ముగ్గురు,నలుగురు స్నేహితులతో గ్రూపుగా చర్చించి అపోహలను నివృత్తి చేసుకున్నట్లు తెలిపారు. సివిల్‌ పరీక్షలో ప్రిలిమినరీ, మెయిన్స్‌,ఇంటర్వ్యూ ఉంటాయని, ప్రిలిమిలరీ ద్వారా 10 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని, మెయిన్స్‌లో అభ్యర్థుల మ్యధ్య పోటీ ఎక్కువగా ఉంటుందన్నారు. అర మార్కులతోనే మెయిన్స్‌ నుంచి ఇంటర్వ్యూకు సెలక్ట్‌ చేస్తారని, నాలుగోసారి తప్పనిసరిగా ఐఏఎస్‌ కావాలని బలమైన నమ్మకంతో సివిల్స్‌ టాపర్‌గా నిలిచనన్నారు.

సాధించగలమనే నమ్మకముండాలి…
అరవింద్‌ బాబు, డీసీపీ,నిజామాబాద్‌

గంటల కొద్దీ చదవడమే కాదు, ఏకగ్రతతో కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు చదివినా ఉద్యోగ సాధనకు ఉపయోగపడుతుంది డీసీపీ అరవింద్‌ బాబు అన్నారు. మైండ్‌ కాన్సంట్రేషన్‌తో పాటు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ అనేది చాల ముఖ్యమన్నారు. నేను సాధించగలననే నమ్మకంతో ముందుకెళ్లాలని, గట్టి పోటీతో అందరి కంటే ముందుండాలన్నారు. ప్రధానంగా పుస్తకాలు చదివే వారు సెల్‌ఫోన్‌కు ప్రభావితం కాకుండా కొన్ని రోజులు దూరంగా ఉంచడం మేలన్నారు.

అయితే పోటీ పరీక్షల అభ్యర్థుల పరీక్షల సమయంలో తికమకపడతారని, దీంతో పరీక్షలు సక్రమంగా రాయక విఫలం చెందుతారన్నారు. ఇలా తికమక చెందకుండా ఏకాగ్రతను ఇనుమడిరపజేసుకోవాలని సూచించారు. తాను బీఫార్మసి డిగ్రీ పొందిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాయని, అత్మ విశ్వాసంతో చదవడం వలన ఉద్యోగం సాధించానని వెల్లడిరచారు. అయితే అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు ఏదైనా, బ్యాగ్రౌండ్‌ ఏదైనా, కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా… మనం చదవాలనే తపన ఉంటే ముందుకు వెళ్లి లక్ష్యాన్ని సాధించుకుంటామనే పట్టుధల ఉండాలని సూచించారు.

ప్రయత్నాలు విఫలమైతే నిశార చెంది అంతటితో ప్రయత్నాన్ని విరమించుకోవద్దని, నిరంతరంగా శ్రమించి గెలిచిన దాంట్లో ఆనందం వేరే ఉంటుదన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్‌, సాక్షి మీడియా గ్రూప్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »