కామారెడ్డి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టుదలతో ప్రణాళికాబద్దంగా చదివితే సివిల్స్ సాధించడం సులభమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం గ్రూప్స్, సివిల్స్ సిలబస్‌పై జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు రాసి విజయాన్ని సాధించవచ్చని సూచించారు.
ఇష్టపడి ఐఏఎస్ సాధించిన వివరాలను తెలిపారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి సులభ పద్ధతిలో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. తల్లి దండ్రుల సహకారం, ఆర్.కె కళాశాల ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్.కె. విద్యార్థులను కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా కళాశాల సీఈవో, కరెస్పాండెంట్ ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సైదయ్య, నవీన్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ గంగాధర్, ప్రభాకర్, బాలు, రవి, శ్రీధర్ పాల్గొన్నారు.