కామారెడ్డి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఎస్ఎంసి కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
మన ఊరు- మన బడి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. మొదటి విడతలో 33శాతం పాఠశాలలో అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల బోధన చేపడుతుందని, పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల, ఎస్ఎంసి సభ్యుల సహకారంతో పాఠశాలలో ప్రగతి పనులు చేపట్టాలని కోరారు. ప్రతి మండలంలో రెండు పాఠశాలలో అభివృద్ధి పనులు జూన్ 12లోగా వంద శాతం పూర్తి చేయాలని చెప్పారు.
శివాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. అంతకుముందు మాచారెడ్డి మండలం భవానిపేట పాఠశాలను సందర్శించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, విద్యాశాఖ అధికారులు, ఎస్ఎంసి చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.