నందిపేట్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో గడిచిన ఆరు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం సుసంపన్నమైంది. భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో స్వామి వారి తొలి దర్శనం చేసుకుని పులకించి పోయారు. ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు, స్వామివారి పరివారం మూర్తుల సంప్రోక్షణ శాస్త్రోక్తంగా సాగింది.
ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవాల చివరి రోజైన గురువారం చౌడమ్మ కొండూరు ఆలయానికి రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, రాజ్యసభ ఎంపి జోగినేపల్లి సంతోష్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజు, డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దంపతులు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్‌ఎంబీ రాజేశ్వర్, పోచారం సురేందర్ రెడ్డి, పలువురు ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిధులు చేరుకొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైభోపేతంగా నిర్వహించిన విమాన శిఖరం ప్రతిష్టాపన ఉత్సవం, ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలను తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఆయా క్రతువులను శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహ తిరు కళ్యాణం నరసింహ స్వామి ఉపన్యాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి ఆధ్వర్యంలోని బృందం నిర్వహించింది. చివరి రోజైన గురువారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పాటు ప్రముఖుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారి నరసింహస్వామి నామస్మరణతో మార్మోగింది.
ఆరు రోజుల కార్యక్రమాలు అనన్య సామాన్యంగా నిర్వహించిన వేదపండితుల బృందాన్ని శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, డి.ఆర్ అనిల్ కుమార్ దంపతులు ఘనంగా సన్మానించారు. వేలాదిగా హాజరైన ప్రజలు నూతనంగా కొలువైన స్వామి వారిని దర్శించుకుని పారవశ్యానికి లోనయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం అనుసారం జరిగిన జల క్షీరాది అథివాసాలు, శిల్పి చెక్కిన దేవతామూర్తుల శేష మలినాలను నిశ్శేషం చేసి, అనన్యమైన శక్తులను నిక్షిప్తం చేసి, మహిమాన్వితమైన ప్రాణప్రతిష్ట చేసి, కోరిన కోరికలు తీర్చే స్వామివారిని గర్భగుడిలో ప్రతిష్ట చేసిన క్రతువు నిర్విఘ్నంగా సాగింది.
ఇకనుంచి స్వామివారు భక్తులకు మంగళ దర్శనమిస్తారని, ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, నరసింహ స్వామి జయంతి, ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవచ్చని వేదపండితులు వేదాల భార్గవ నరసింహస్వామి తెలిపారు. వేడుకలలో ముఖ్యమంత్రి సతీమణి కల్వకుంట్ల శోభ, రామ్‌కిషన్ రావు, నవలత దంపతులు, కల్వకుంట్ల కవిత, డిఆర్ అనిల్ కుమార్ దంపతులు, ననిత అరుణ్ కుమార్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఆయా క్రతువుల్లో పాలుపంచుకున్నారు.