లక్ష్యానికి మించి పంట రుణాలు అందించాలి

నిజామాబాద్‌, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకీ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు హితవు పలికారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.

గత ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి బ్యాంకుల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోవడం పట్ల కలెక్టర్‌ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగు జలాలు అందుబాటులో ఉండడంతో ఈసారి రైతులు అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన ఫలితంగా పెద్ద ఎత్తున దిగుబడులు చేతికందాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్ధిక వెసులుబాటు కలిగేలా బ్యాంకర్లు విరివిగా రుణాలు పంపిణి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అర్హులైన ప్రతి రైతు రుణ సదుపాయాన్ని పొందేలా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావుకు సూచించారు. రుణాల రికవరీ విషయమై సంశయాలకు గురి కావాల్సిన అవసరం లేదని, అవసరమైతే రికవరీకి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని కలెక్టర్‌ భరోసా కల్పించారు. నిర్ణీత లక్ష్యంలో సగటున కనీసం 95 శాతం మేరకు పంట రుణాల పంపిణి తప్పనిసరిగా జరిగేలా చొరవ చూపాలన్నారు. గతేడాదితో పోలిస్తే కొంతవరకు రుణ పంపిణీలో ప్రగతి ఉన్నప్పటికీ మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.

ఖరీఫ్‌, రబీ సీజన్‌ లను కలుపుకుని 2021 – 22 ఆర్ధిక సంవత్సరంలో 3550.68 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం కాగా, 2953.35 కోట్ల రూపాయల రుణాలు అందించి 83.18 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు. వచ్చే త్రైమాసికం నాటికి రుణ పంపిణీ 95 శాతం దాటాలని, టర్మ్‌ లోన్స్‌ 90 శాతానికి మించి పంపిణీ జరగాలని సూచించారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఉదారంగా రుణాలు అందించాలని అన్నారు.

జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు వస్తున్నందున అందుకు అనుగుణంగా రైస్‌ మిల్లులు ఏర్పాటు కావాల్సిన ఆవశ్యక ఉందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మర ఆడిరచే సామర్ధ్యంలోనే రైసుమిల్లులు ఉన్నాయని, కనీసం 12 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం మేరకు వాటి సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైస్‌ మిల్లుల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు రుణాలు అందించి ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని అన్నారు.

వరి, సోయా, పసుపు, ఎర్ర జొన్న పంటల సాగుకు జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతున్నందున వారికి రుణ పంపిణీ రూపంలో అవసరమైన పెట్టుబడిని సమకూర్చేందుకు బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా విద్యా రంగానికి సంబంధించి మానవీయ కోణంలో రుణాలు అందించాలని హితవు పలికారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో అలసత్వ వైఖరిని ప్రదర్శించకూడదని అన్నారు.

ఇప్పటికే సబ్సిడీ రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను నెలకొల్పేలా చూడాలని, ఒకవేళ యూనిట్ల స్థాపన చేయనట్లయితే సబ్సిడీ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆయా సంక్షేమ శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేసిన 65 యూనిట్లు మొత్తానికి మొత్తం వారం రోజుల్లో నెలకొల్పేలా చూడాలన్నారు.

కాగా, దళిత బంధు పథకం కింద తొలి విడతలో జిల్లాలో 550 మంది లబ్దిదారులకు స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ వివిధ యూనిట్లను మంజూరు చేసిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. సదరు లబ్ధిదారులు తమ యూనిట్లను మరింతగా విస్తరించుకునేందుకు వీలుగా స్టాండ్‌ అప్‌ ఇండియా కింద బ్యాంకర్లు వారికి తోడ్పాటును అందించాలని సూచించారు. కనీసం వంద మందికైనా లబ్ది చేకూర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు సూచించారు.

వార్షిక రుణ ప్రణాళిక విడుదల

ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. పంట రుణాల కింద 3846.89 కోట్ల రూపాయలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న. అలాగే, చిన్న నీటి వనరులకు 87 కోట్లు, భూమి అభివృద్ధికి 43.92 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 252.77 కోట్లు, మొక్కల పెంపకం, ఉద్యానవన రంగానికి 140.58 కోట్లు, పశు సంవర్ధక, పాడి పరిశ్రమకు 178.23 కోట్లు, మేకలు, గొర్రెల పెంపకానికి 29.57 కోట్లు, కోళ్ల పెంపకానికి 74.53 కోట్లు, పంట ఉత్పత్తుల నిలువ, మార్కెటింగ్‌ సదుపాయాల కోసం 136.88 కోట్లు, అటవీ, నిరుపయోగ భూముల అభివృద్ధి కోసం 8.60 కోట్లు, మత్స్య పరిశ్రమ రంగానికి 17.12 కోట్లు, ఇతర రంగాలకు 434.81 కోట్ల రూపాయల చొప్పున రుణాలు అందించాలని లక్ష్యంగా పేర్కొన్నారు.

అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు లింకేజీ రుణాల కింద 530 కోట్ల రూపాయలను, ప్రాధాన్యత రంగాలకు 1457.53 కోట్లు, ఇతర రంగాల కింద 260.24 కోట్లు, అప్రాధాన్యత రంగానికి 175 కోట్ల రూపాయల రుణాలు వితరణ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సమావేశంలో నాబార్డ్‌ ఏజీఎం నాగేష్‌, ఆర్‌బిఐ అధికారి రాజేంద్రప్రసాద్‌, డీఆర్‌డీఓ చందర్‌, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »