నిజామాబాద్, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ నెల 18న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు జిల్లా పర్యటనకు హాజరవుతున్న సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో వృద్ధుల కోసం సుమారు 50 లక్షల రూపాయలను వెచ్చిస్తూ నూతనంగా నెలకొల్పిన ‘ఆలన’ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే స్కిల్ సెంటర్‌ను, 50 పడకల సామర్థ్యంతో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఐసీయూ యూనిట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి చుట్టూ పరిసరాలను ప్రతి అంగుళం పరిశీలన జరిపిన కలెక్టర్, అడుగడుగున నెలకొని ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది అంతస్తుల భవన సముదాయంతో కూడిన ఆసుపత్రిలో అనేక చోట్ల డ్రైనేజీ పైప్ లైన్ల లీకేజీలు ఉండడం, ఆసుపత్రి ప్రాంగణంలో వ్యర్థ జలాలు నిలిచి ఉండడం, పరిసరాలు దుర్గంధం వెదజల్లుతూ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రి లోపల ఒక్కో విభాగం వారిగా తనిఖీ చేసిన కలెక్టర్ అనేక లోపాలను ఎత్తి చూపారు. యుద్ధ ప్రాతిపదికన లీకేజీలకు మరమ్మత్తులు జరిపించాలని, ఆస్పత్రి లోపలి భాగంతో పాటు, బయట ప్రాంగణంలోనూ ఏ ఒక్క చోట కూడా నీరు నిల్వ ఉండకూడదని ఆదేశించారు. ఆస్పత్రిలోని ఆవరణలో ఉన్న ఓపెన్ డ్రైనేజి మీద పైకప్పు నిర్మించాలన్నారు. చెత్తాచెదారం తొలగిస్తూ ఖాళీ ప్రదేశంలో విరివిగా మొక్కలు నాటించాలని సూచించారు. ఆస్పత్రి వ్యర్థాలను వెంటనే జనావాసాలకు దూరంగా తరలించాలని పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దుకోవాలని, ఎక్కడ కూడా కరెంటు తీగలు వేలాడుతూ కనిపించకూడదని ట్రాన్స్ కో డీ.ఈ తోట రాజశేఖర్‌ను ఆదేశించారు. పగిలిన అద్దాలు, కిటికీలు సరిచేసుకోవాలని, మూడు రోజుల లోపు పనులన్నీ పూర్తి కావాలని గడువు విధించారు. మంత్రి సందర్శన సమయంలో ఏ చిన్న లోపం బయటపడినా సంబంధిత అధికారులను బాధ్యు లుగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరమ్మతులు, ఇతర నిర్మాణ పనులకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని, నాణ్యతతో పనూలు జరిపించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, టీఎస్ ఎంఎస్ ఐడీసీ అధికారులు, మున్సిపల్ కార్పోరేషన్ ఇంజినీర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.