భీమ్‌గల్, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణానికి సమీపంలో లింబాద్రి లక్ష్మి నరసింహాస్వామి గుడి దగ్గర్లో అర్బన్ ఫారెస్ట్ కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన ప్రాంతంలో మొక్కలు నాటి నీరుపోశారు.
అర్బన్ పార్కుకు సంబంధించిన ప్రతిపాదనలు, నిర్మాణం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ మదిలో నుండి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు వల్ల పట్టణ సమీపంలోని వాసులకే కాకుండా సమీప గ్రామాల ప్రజలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. లింబాద్రీ గుట్ట దగ్గర ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్కు భీంగల్ పట్టణ వాసులతో పాటు బాచన్ పల్లి, పిప్రి, మెండోర, పల్లికొండ గ్రామాల ప్రజలకు, లింబాద్రి లక్ష్మినరసింహస్వామీ దర్శనానికి వచ్చే భక్తులకు కూడా సేద తీరేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
పార్క్ లో 5 కి.మీల వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, లైటింగ్, వాష్ రూమ్స్, చేంజింగ్ రూమ్, వాచ్ టవర్లు, చిట్టడివి, కాంపౌండ్ వాల్ లు ఏర్పాటు చేసేలా 6 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసారని చెప్పారు. త్వరలో పార్కుకు సంబంధించిన ప్రపోజల్స్‌పై అటవీ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో హైదరాబాద్‌లో సమావేశమై చర్చిస్తానన్నారు.
భీంగల్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు లింబాద్రి లక్ష్మి నరసింహస్వామీ ఆశీస్సులతో త్వరలో మంజూరీ అయ్యి, అందుంటులోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అర్బన్ పార్కుతో పాటు సుమారు 500 ఎకరాల విస్తర్ణంలో ఉన్న అడవిని ఆధునిక పద్దతిలో పునరుద్ధరణ చేయనున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసిఆర్,అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సునిల్ ఈరమన్, ఆర్డీవో శ్రీనివాసులు, పలువురు అటవీ అధికారులు, స్థానిక అధికారులు, ఎంపిపి ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ రవి, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.