నిజామాబాద్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా కవి, విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీశ్రీ 39 వ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల (ఐఎఫ్‌టియు, ఏఐకెఎంఎస్, పివైఎల్) ఆధ్వర్యంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా కార్యాలయం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ శ్రీశ్రీ సాంప్రదాయ కవిత్వాన్ని బద్దలు కొట్టి, ప్రజా సమస్యలను కవితారూపంలో తీసుకొచ్చిన ప్రజా కవి అని కొనియాడారు.
శ్రీశ్రీ కవితలు విప్లవోద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చాయన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానం విప్లవకారులకు సదా స్పూర్తినిచ్చేదన్నారు. నేటి యువత, విద్యార్థులు శ్రీశ్రీ రచనలను చదవాలన్నారు. శ్రీశ్రీ సాహిత్యం ప్రజల బాధలను వ్యక్తం చేసిందన్నారు. కళలు వ్యక్తి కోసం కాకుండా సమాజం కోసం ఉండాలన్నారు. శ్రీశ్రీ రచనలు అధ్యయనం చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.కిషన్, ఎం.సుమన్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్, పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కే.రాజేశ్వర్, లింబాద్రి, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు మారుతిగౌడ్, కార్యదర్శి సాయిలు, నాయకులు నారాయణ, తారాచంద్, రమేష్, గంగాధర్, అనీష్, భూమన్న మనోజ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.