నిజామాబాద్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి సమాజంలో డబ్బులు కలిగి ఉండడం గొప్ప కాదని, అనాధలు, అభాగ్యులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్‌కు చెందిన ప్రవాస భారతీయులైన శ్రీధర్, సుచిత్ర దంపతులు ఏడు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అనాధ బాలల కోసం తమ స్వస్థలంలో నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణంలో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమాన్ని నెలకొల్పారు.
అన్ని సదుపాయాలతో దాదాపు 320 బాలలకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అనాధ ఆశ్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డిలతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని సైతం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అనాధ బాలలు, నిరాదరణకు గురైన చిన్నారుల కోసం ఉమ్మడి జిల్లాలోనే భారీ స్థాయిలో అనాధ ఆశ్రమాన్ని తన నియోజకవర్గంలో నెలకొల్పడం అభినందనీయమన్నారు. సంక్షేమ హాస్టళ్లలో వందమంది బాలలకు ప్రభుత్వ పరంగా వసతి కల్పించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాంటిది మూడు వందల పైచిలుకు మంది అనాధలకు భోజన వసతితో కూడిన ఆశ్రయం అందించేందుకు శ్రీధర్ దంపతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం సాధారణ విషయం కాదన్నారు.
సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరువకూడదని, మనల్ని ప్రేమించే వారిని ద్వేషించకూడదని, నమ్మినవారిని మోసం చేయకూడదు వంటి అత్యుత్తమ సుగుణాలన్నీ శ్రీధర్ దంపతుల్లో ఉన్నాయని కొనియాడారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా మానవతా దృక్పథంతో ఇంత పెద్ద ఎత్తున అనాధాశ్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని, అనాథాశ్రమం శాశ్వత ప్రాతిపదికన కొనసాగేలా తన వంతు తోడ్పాటును అందిస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
అనాధలకు అండదండగా నిలవాలని ఆచరణాత్మకంగా నిరూపిస్తూ శ్రీధర్ దంపతులు నిర్మించిన అనాధ ఆశ్రమానికి స్థానికులు కూడా అండగా నిలుస్తూ ఈ సత్కార్యంలో అందరూ భాగస్వాములు కావాలని పోచారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకుల కోరిక మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనాధ ఆశ్రమానికి శౌరిస్ రాజ్ హోమ్ గా నామకరణం చేశారు.
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ప్రస్తుతం నాకేమిటి అనే భావన నెలకొని ఉన్న తరుణంలోనూ పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అనాధల కోసం సకల హంగులతో వసతి సదుపాయాలను సమకూర్చడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. వృత్తిరీత్యా విదేశాల్లో స్థిర పడినప్పటికీ, తమ స్వగ్రామాన్ని మర్చిపోకుండా అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకు రావడం స్పూర్తిదాయకమని అన్నారు. సమాజంలో మనకు మనం గొప్పగా బ్రతకడం ఎంత ముఖ్యమో తమ చుట్టుపక్కల ఉన్న వారిని ఆదుకునేందుకు చొరవ చూపడం కూడా తమ కనీస బాధ్యత అని గుర్తించాలన్నారు.
యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసిన కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారారని, రోడ్డు ప్రమాదాల్లో సంరక్షకులను కోల్పోయి మరికొందరు అనాధలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటివారికి మేమున్నాం అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనాథల బాగోగులను చూసుకునే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే అనే భావనను వీడి, వారిని ఆదుకునేందుకు ఆర్థికంగా పలుకుబడి కలిగిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎంతో ఉదాత్తమైన ఆశయంతో నెలకొల్పిన ఈ అనాధ ఆశ్రమానికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, కోటగిరి ఎంపీపీ సునీత, జెడ్‌పిటిసి శంకర్ తదితరులు పాల్గొన్నారు.