నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేనాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పల్లె ప్రగతిలో పెండిరగ్ పనుల విషయమై ట్రాన్స్ కో, ఎంపీఓలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పట్ల మండల పంచాయతీ అధికారులు, ట్రాన్స్ కో ఏ.ఈలు అలసత్వ ధోరణిని విడనాడి పెండిరగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా విద్యుత్ సమస్యలపైనే తమకు ఫిర్యాదులు చేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
శిథిలావస్థకు చేరిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తూ, వంగిన స్తంభాలను వెంటనే సరి చేయాలని సూచించారు. ఏ ఒక్క చోట కూడా వేలాడుతున్న విద్యుత్ వైర్లు ఉండకూడదని అన్నారు. ఎంపీఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుపుతూ, ట్రాన్స్ కో ఏ.ఈలతో సమన్వయాన్ని పెంపొందించుకుని ఈ పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 18 వ తేదీ నాటికి ఏ ఒక్క పని కూడా పెండిరగ్లో లేకుండా చూడాలన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులలో విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనూ కంపోస్ట్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తూ, ఎరువు తయారీ జరగాలని, దీనివల్ల పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు.
ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తిస్తూ, తదనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. పల్లె ప్రగతి ముగిసిన మీదట పై పనులు పెండిరగ్ ఉంటే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ జయసుధ, ట్రాన్స్ కో ఎస్‌ఈ ఆర్.రవీందర్, ఏడీఈ తోట రాజశేఖర్, ఆయా మండలాల ఏ.ఈలు, ఎంపీఓ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.