కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఆర్‌కె గ్రూప్స్ ఆఫ్ కాలేజెస్‌కు గురువారం ఉదయం షోకాజ్ నోటీసులు ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ జారీ చేశారు. కామారెడ్డిలో గల ఆర్‌కె కళాశాల గ్రూప్‌లో మూడు కళాశాలకు నోటీసులు అందాయన్నారు.
ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య బి. విద్యావర్ధిని, సిబ్బంది తనిఖీ చేసి సమర్పించిన నివేదిక ప్రకారం… ఆర్‌కె డిగ్రీ కళాశాలలో మొత్తం 20 కోర్సులున్నాయని, వాటికి 45 తరగతి గదులు, 26 ప్రయోగశాలలు ఉండాలన్నారు. కాని కేవలం 42 తరగతి గదులు, 20 ప్రయోగశాలలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఎస్‌ఆర్‌కె డిగ్రీ కళాశాలలో మొత్తం 14 కోర్సులున్నాయని, వాటికి 36 తరగతి గదులు, 18 ప్రయోగశాలలు ఉండాలన్నారు. కాని కేవలం 30 తరగతి గదులు, 12 ప్రయోగశాలలు మాత్రమే ఉన్నాయని అన్నారు.
ఆర్‌కె కాలేజెస్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్ కళాశాలలో మొత్తం 11 కోర్సులున్నాయని, వాటికి 21 తరగతి గదులు, 9 ప్రయోగశాలలు ఉండాలన్నారు. కాని కేవలం 11 తరగతి గదులు, 5 ప్రయోగశాలలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఏ కాలేజ్‌లో కూడా గైడ్ లైన్స్ నిబంధనలను అనుసరించి తరగతి గదులు, ప్రయోగశాలలు లేవని అన్నారు.
ఒక్కో తరగతి గది 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలని కాని దీని కంటే తక్కువ స్థలంలో మాత్రమే గదుల నిర్మాణం జరిగిందన్నారు. అదే విధంగా విద్యార్థుల సంఖ్యకు సరిపడు మూత్రశాలలు, ఆటస్థలం, వాహన పార్కింగ్ సౌకర్యం లేవని అన్నారు. షోకాజ్ నోటీసులకు 15 రోజులలో జవాబు ఇవ్వాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.