ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని నియంత్రించాలి

నిజామాబాద్‌, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా విద్యాధికారి (డి.ఈ.వో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డీఈవోకి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రైమరీ తరగతులకు 25 వేల నుంచి 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. హైస్కూల్‌ ఫీజులు తల్లిదండ్రులకు మరింత భారమయ్యాయన్నారు.

ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తు, సౌకర్యాలు కల్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్నారు. స్టేషనరీ, యూనిఫాంలపై బుక్‌స్టాల్‌ యాజమాన్యాలతో కమిషన్‌ మాట్లాడుకుంటున్నారన్నారు. స్కూల్‌ బస్సుల ఫిట్నెస్‌ పరీక్షలు చేయించుకోవడం లేదన్నారు. కానీ బస్సు ఫీజులను మాత్రం పెంచుతున్నారన్నారు. ఇన్ని రకాలుగా దోపిడీ జరుగుతున్న విద్యాధికారుల నుండి కనీస చర్యలు లేవన్నారు.

మరొకవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కరువై, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, మూత్రశాలలు, సరిపడా భవనాలు, ఆటస్థలం, ప్రహరీ గోడలు, విద్యుత్‌, ఖాళీ పోస్టులు వంటి సమస్యలు జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో ఉన్నాయన్నారు. కోవిడ్‌ సమయం నుండి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. కానీ పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీ జరగలేదన్నారు. దీంతో విద్యార్థులు మళ్ళీ ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.

విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు ఇంతవరకు అందలేదన్నారు. ఇవన్నీ పరిణామాలు పేదవిద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజుల వివరాలు స్కూల్‌ నోటీస్‌ బోర్డ్‌లో పెట్టే విధంగా యాజమాన్యాలను ఆదేశించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పి.డి.ఎస్‌.యు జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్‌, జిల్లా నాయకులు నిఖిల్‌, మహిపాల్‌, చందు, దేవిక, అజయ్‌, వినోద్‌, మధు, వేణు, భార్గవ్‌, శేఖర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »