నిజామాబాద్, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధిలో స్వచ్చందంగా భాగస్వాములవుతూ, ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా లక్ష రూపాయలకు పైబడి విరాళాలు అందించిన దాతలను మా ఊరి మహరాజులుగా గుర్తిస్తూ ప్రభుత్వపరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే పల్లె ప్రగతి ముగింపు సభల్లో ఘనంగా సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
జిల్లాలో మొత్తం 16 మంది దాతలు లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో విరాళాలు సమకూర్చారని వివరించారు. భీంగల్ మండలం చెంగల్ గ్రామపంచాయతీకి నోముల రాజేశ్వర్ రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి 2.60 లక్షల రూపాయల విలువ చేసే వైకుంఠ రథాన్ని, షెడ్‌ను అందించారని తెలిపారు. జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రవీందర్ రెడ్డి లక్ష రూపాయల విలువ చేసే టేబుళ్లను వితరణ చేశారని వివరించారు.
ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామపంచాయతీకి ప్రవాస భారతీయుడైన యేలేటి సత్యపాల్ రెడ్డి రెండున్నర లక్షల విలువ చేసే వైకుంఠ రథం అందించారని, చందూర్ మండలం పెంటాఖుర్దు క్యాంప్ గ్రామానికి పీ.హనుమంతరావు, చందూర్ గ్రామానికి తాటిపాముల శ్రీనివాస్, తాటిపాముల శంకర్ వైకుంఠ రథాలు వితరణ చేశారని తెలిపారు. ధర్పల్లి గ్రామ పంచాయతీకి స్థానిక ఎంపీపీ ఎన్.సారిక హన్మంతరెడ్డి వైకుంఠ స్వర్గరథం అందించగా, మెంట్రాజ్‌పల్లి జీపీకి స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ బాడీ ఫ్రీజర్, బర్దీపూర్ వీడీసీ స్థానిక జీపీకి సి.సి. కెమెరా సామాగ్రిని, సాంపల్లి జీపీకి రాజేశ్వర్ గౌడ్ లక్ష రూపాయలను వితరణ చేశారని వివరించారు.
ఇందల్వాయి మండలం తీర్మానపల్లి గ్రామానికి పీ.మహేష్ వైకుంఠ రథం సమకూర్చగా, గన్నారం సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి స్థానిక జీపీ కి లక్ష రూపాయలను అందించారని, మాక్లూర్ మండలం బొంకన్ పల్లి గ్రామానికి పీ.కరీముల్లా రెండున్నర లక్షల రూపాయలను విరాళంగా అందించగా, నిజామాబాద్ మండల్ పాల్దా వీడీసీ గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు అందించిందని, సిరికొండ మండలం రావుట్ల వీడీసీ బాడీ ఫ్రీజర్, వైకుంఠ రథం కోసం రెండు లక్షల రూపాయలను విరాళం రూపేణా సమకూర్చిందని తెలిపారు.
వీరిని పల్లె ప్రగతి ముగింపు సభలో ఘనంగా సన్మానించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. కాగా, పల్లె ప్రగతి 5 వ విడత సందర్భంగా జిల్లాలో మొత్తం 513 మంది దాతలు 58 లక్షల 17 వేల 445 రూపాయల విలువ చేసే వస్తువులు, నగదును విరాళం రూపంలో అందించారని అన్నారు.